Home > తెలంగాణ > రాజయ్య యూటర్న్.. మళ్లీ మొదటికొచ్చిన స్టేషన్‌ఘన్‌పూర్ పంచాది..

రాజయ్య యూటర్న్.. మళ్లీ మొదటికొచ్చిన స్టేషన్‌ఘన్‌పూర్ పంచాది..

రాజయ్య యూటర్న్.. మళ్లీ మొదటికొచ్చిన స్టేషన్‌ఘన్‌పూర్ పంచాది..
X

స్టేషన్ ఘన్పూర్ లో బీఆర్ఎస్ టికెట్ల లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. కేటీఆర్ చొరవతో విబేధాలు కొలిక్కి వచ్చాయని అంతా భావిస్తున్న సమయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ బీ ఫాం తనదేనని ప్రకటించుకున్నారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వని పక్షంలో పోటీ చేసే అంశాన్ని కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

లింగాల గణపురం మండలం వడ్డీచర్లలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. అనంతరం డప్పు కొట్టి దరువు వేశారు. డప్పు, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రాజయ్య.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు ఆయన టికెట్‌ తనకే ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ కేసీఆర్‌ ఫస్ట్ లిస్ట్ ప్రకటించినప్పుడు కేటీఆర్‌ లేకపోవడంతో రెండ్రోజుల క్రితం మళ్లీ ఆయనను కలిసినట్లు చెప్పారు.

భేటీలో కేటీఆర్ తనకు ఎమ్మెల్సీ లేదా ఎంపీగా అవకాశమిస్తానని చెప్పారని, అప్పటి వరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మని చెప్పారని రాజయ్య వెల్లడించారు. అదే సమయంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడే ఉండటంతో వారితో కలిసి ఫోటోలు దిగానని అన్నారు. ఆ ఫోటో, మీడియాలో వచ్చిన ఊహాగానాలతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని రాజయ్య స్పష్టం చేశారు.

కడియంతో తాను ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరపలేదని చెప్పారు. కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించినా ఇప్పటికీ వారికి బీఫాంలు ఇవ్వలేదన్న రాజయ్య.. కొన్ని నియోజక వర్గాలలో మార్పులు ఉంటాయని చెప్పారు. 2024 జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా తానే ఎమ్మెల్యేనన్న ఆయన.. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దామోదర రాజనర్సింహతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు తను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానని మీడియాలో కథనాలు వచ్చాయని, కానీ అందులో నిజం లేదని రాజయ్య స్పష్టం చేశారు.

Updated : 24 Sep 2023 2:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top