బీఆర్ఎస్ నన్ను అవమానించింది..అందుకే కాంగ్రెస్ లోకి వచ్చా.. Vemula Veeresham
X
పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే వేముల వీరేశం నిప్పులు చెరిగారు. తనను అవమానించిన బీఆర్ఎస్ నుంచి ఆదరించే కాంగ్రెస్ కు వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ హాయంలో తెలంగాణ సమాజం ఇప్పుడు స్వేచ్ఛవాయువులు పీల్చుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రజాభవన్ లో గతంలో ప్రజలకు అనుమతి లేదని..దొరల గడిలను బద్దలు కొట్టి ప్రజల సంక్షేమం కోసం ప్రజా భవన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం దళిత జాతిని అవమానించిందని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంగా రాజయ్యను పెట్టి తీసేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని చెప్పారు. కానీ దళితులకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. దళిత సభ్యుడైన భట్టికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి రేవంత్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రజలకు మాట్లాడే హక్కును హరించారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను చదువుకు దూరం చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సంక్షేమాన్ని ప్రజలు గుర్తిస్తే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు
ఇప్పటికైనా గుణపాఠం తీసుకొని అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణలో అనేక రంగాలను విధ్వంసం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ అవినీతి, అవకతవకలు బయట పడుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆయన..చాలా గ్రామాల్లో భగీరథ నీళ్లు రావడం లేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ మాట్లాడే బాష మార్చుకోవాలని సూచించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వేముల వీరేశం తేల్చి చెప్పారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించారు.