MLC Balmuri Venkat:మల్కాజ్‌గిరిలో పోటీకి నేను సిద్ధం.. బల్మూరి వెంకట్
X
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాల్‌కు స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మల్కాజ్‌గిరి బరిలో నేను దిగుతా అని.. దమ్ముంటే కేటీఆర్ నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తా అని అన్నారు. మల్కాజ్‌గిరినే కాదు.. కేటీఆర్ కోరుకున్న నియోజకవర్గంలో తాను పోటీకి సిద్ధమని ఎమ్మెల్సీ వెంకట్ ప్రకటించారు.
కాగా, అంతకుముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తాను. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం. మీ సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం.. సేఫ్ గేమ్ వద్దు.. డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. తాజాగా.. కేటీఆర్ విసిరిన ఈ సవాల్‌కు బల్మూరి వెంకట్ స్పందించి, కేటీఆర్‌కు ప్రతి సవాల్ విసిరారు.
ఈ సవాళ్ల పర్వం ఈ నెల 27న చేవెళ్లలో మొదలైంది. అక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్.. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తాను కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని, కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని పదవుల్లోకి వచ్చాడని విమర్శించారు. అలాగే కేటీఆర్‌కు దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటైన గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తాజాగా ఇద్దరం కలిసి రాజీనామా చేసి.. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు.