KTR vs Jeevan Reddy:దమ్ముంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయి.. జీవన్ రెడ్డి
X
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వార్, ఇటీవల ముఖ్యమంత్రి రియాక్షన్‌తో తారాస్థాయికి చేరింది. దీనిపై కేటీఆర్ సీఎంకు సవాల్ విసరగా.. ఇప్పటికే బల్మూరి వెంకట్, మంత్రి తుమ్మల సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ విసిరారు. ఇక తాజాగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సైతం మల్కాజిగిరిలో పోటీ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విసిరిన సవాల్‌పై కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. జగిత్యాలలోని తన నివాసంలో మాట్లాడిన ఆయన, సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ ఇలాగే మాట్లాడితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కి కేవలం మెదక్ ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందని, కానీ కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే అది కూడా గెలిచేలా లేదని అన్నారు. ఈ క్రమంలోనే దమ్ముంటే నిజామాబాద్, కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలవాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్ కు ఇంకా జ్ఞానోదయం కావడం లేదని.. ముందు మెడిగడ్డలో తప్పులను సరి చేస్కోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నాయకులు ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీకి కనీసం 3 సీట్లు కూడా వచ్చేవి కావని ఇటీవల జరిగిన ఓ సభలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలంటూ బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. దీనిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.