జాబితాలో మహిళలకు చోటు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత కౌంటర్
X
బీఆర్ఎస్ టికెట్ల పంపిణీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. లోక్‌సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ దీక్షలు చేసిన వారు తెలంగాణలో 7 స్థానాలు మాత్రమే మహిళలకు ఇచ్చారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ... చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిజెపి రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మీ అక్కసును అర్థం చేసుకోగలం
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉన్నది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితులు మార్పు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దామని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీ పై మీరు వెళ్లగకుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీ రాజకీయ అభద్రతభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు.
పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ గారు ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. మహిళా హక్కుల పై కిషన్ రెడ్డి ఆందోళన ఆశ్చర్యపరిచినప్పటికీ స్వాగతిస్తున్నానని, చివరికి బీజేపీ నుంచి ఎవరోఒకరు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను ధ్రువీకరించారని పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
బీఆర్ఎస్ లిస్ట్ చూస్తుంటే ఈసారి అధికారంలోకి రాలేమని సీఎం కేసీఆర్‌కు అర్థమైనట్లు ఉందన్నారు కిషన్ రెడ్డి. ‘‘ మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. భాజపా భయంతోనే గజ్వేల్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని కామారెడ్డిలో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ దీక్షలు చేసిన వారు తెలంగాణలో 7 స్థానాలు మాత్రమే మహిళలకు ఇచ్చారు. 33 శాతం అంటే ఏడు సీట్లేనా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.