బీఆర్ఎస్ అభివృద్ధి - కాంగ్రెస్ అరాచకానికి మధ్య ఎన్నికలు : కవిత
X
ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. ఈసీ పరిధిలో అధికారులు పనిచేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పేరును ఇప్పటికే రెడ్ డైరీలో రాసుకున్నారని స్పష్టం చేశారు.
మంచినీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్.. రేపు అధికారంలోకి వచ్చి ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పూటకో ముఖ్యమంత్రి మారుతూ అస్థిర పాలన ఏర్పడుందని.. ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు.
బీఆర్‌ఎస్ బోధన్ అభ్యర్థి షకీల్పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని కవిత ఆరోపించారు. ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం పోలీసులపైకి ఉల్టా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తాము అభివృద్ధి వైపు వెళ్తుంటే.. వాళ్లు అరాచకం వైపు వెళ్తున్నారని విమర్శించారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణను అభివృద్ధి చేయడం తప్ప ఎటువంటి తప్పు చేయలేదన్నారు. గత పదేళ్లలో మతకల్లోలాలు లేకుండా పాలన సాగించామన్నారు. కర్నాటకలో గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరచిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.