MLC Kavitha: స్మృతి ఇరానీ కామెంట్స్‌పై కవిత రియాక్షన్ ఇదే
X
నెలసరి సెలవుల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను నిరుత్సాహపడ్డానని, ఇలాంటి అజ్ఞానాన్ని చూడటం దారుణమని అన్నారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను.. కేంద్ర మంత్రి వ్యతిరేకించడం నిరుత్సాహపరిచిందని విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు.
రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం మహిళల నిజమైన బాధను విస్మరించడమేనని అన్నారు. ‘‘నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించింది. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నా. నెలసరి మనకున్న ఎంపిక కాదు. అదొక సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లే’’ అంటూ కవిత ట్విటర్ ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.