కాంగ్రెస్ నేతల వల్లే రైతు బంధు ఆగిపోయింది : కవిత
X
రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకోవడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ నేతల వల్లే రైతు బంధు ఆగిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేకతను చాటుకుందని అన్నారు. రైతు బంధు ఆన్ గోయింగ్ కార్యక్రమం అని.. ఇది ఎన్నికల ముందు పెట్టిన పథకం కాదని చెప్పారు. తమ ఎన్నికల మేనిఫేస్టోలోనూ ఇది లేదన్నారు. రైతులంతా కేసీఆర్ వైపు ఉన్నారన్న అభద్రతా భావంతోనే కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు. రైతు నోటికాడ బుక్కను లాక్కున్న కాంగ్రెస్కు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో రైతు బంధు నిధుల పంపిణీకి బ్రేక్ పడింది. నియమాలు ఉల్లంఘించారని ఈసీ అనుమతిని వెనక్కి తీసుకుంది. కాగా మూడు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28లోపు రైతుబంధు నిధులు ఇచ్చేందుకు అనుమతించింది. దీంతో ప్రభుత్వం రైతుల అకౌంట్లలో నిధులు జమచేసేందుకు సిద్ధమైంది. శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు కావడంతో.. మంగళవారం నిధులు అకౌంట్లలో జమచేయాలని భావించింది. అయితే ఈసీ తన అనుమతిని వెనక్కి తీసుకోవడంతో దీనికి బ్రేక్ పడింది.