తెలంగాణ రాకముందు దయనీయస్థితిలో నిజామాబాద్ : కవిత
X
దేశాన్ని 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి చేసిందేమిలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కానీ గత పదేళ్లలో పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తాకు మద్దతుగా నాగారంలో ఆమె రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాక ముందు ఈ నగరం దయనీయ స్థితిలో ఉండేదని.. కానీ ఇప్పుడు అన్ని వసతులు కల్పించామని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నాగారంను దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
తాము పేదలకు ఉపయోగపడేలా మేనిఫెస్టోను రూపొందించామని కవిత తెలిపారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటిని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ఒక మైనార్టీ కాలేజీ ఉంటే.. ఇప్పుడు 23 కాలేజీలు ఉన్నాయని చెప్పారు. నిజామాబాద్ ఐటీ హబ్లో 3200 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా మతఘర్షణలు లేవన్నారు. వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. మానవతా దృక్పథంతో పని చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.