విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు.. MLC కవిత ఆవేదన
X
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని వెంటనే సీరియస్‌గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతోందో అన్నదానిపై సమీక్ష చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కవిత. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో ఉన్నారా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది పిల్లలను చదివిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వరుస సంఘటనల జరుగుతుంటే ఆందోళన కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు ? సిలబస్ బాగోలేదా ? కౌన్సిలర్ల సంఖ్య తక్కువగా ఉందా ? మరే సౌకర్యాల కొరత ఉందా ? సమయానికి నాణ్యమైన ఆహారం అందుతుందా ? వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యా శాఖకు పూర్తి స్థాయి మంత్రి లేరు కాబట్టి సమీక్ష చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రియే చొరవ తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయం విద్యార్థుల మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మార్కులు, ర్యాంకులు అంటూ ఒత్తిడి చేయవద్దని కోరారు.
ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లి నేచర్ కల్పించాలని కోరారు. ప్రతి హాస్టల్‌లో సైకాలజిస్ట్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారుచేయాలన్నారు.అస్మిత కుటుంభానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దన్నారు. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.