హైదరాబాద్ బిర్యానీ తిని హ్యాపీగా వెళ్లండి - ఎమ్మెల్సీ కవిత
X
బీజేపీ, కాంగ్రెస్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందం కుదిరినందునే సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏడాదిగా ముందుకు కదలడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా మధ్య కుదిరిన అవగాహన ఏమిటో బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న పొలిటికల్ టూరిస్టులకు వెల్ కం అంటూ కవిత సటైర్ వేశారు. హైదరాబాద్ బిర్యానీ తిని హ్యాపీగా వెళ్లండి తప్ప ఇక్కడి ప్రజలను మరోసారి మభ్యపెట్టొద్దని అన్నారు. కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వైఖరి అవలంబిస్తోందని కవిత ఫైర్ అయ్యారు. ఓ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ మరో రాష్ట్రంలో అదే పార్టీని వ్యతిరేకిస్తుందని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత, ద్వంద్వ వైఖరి ప్రజలందరికీ అర్థమయ్యాయని అన్నారు.
రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై సోనియా, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. పార్లమెంటు స్పెషల్ సెషన్లో మహిళా బిల్లును ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ దీనిపై మరోసారి తీర్మానం చేసిందని, ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారని చెప్పారు.