ప్రజలు కరెంట్ బిల్లులు కట్టొద్దు : కవిత
X
ప్రజలు 200 యూనిట్లలోపు కరెంట్ వినియోగానికి బిల్లు కట్టొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 200 యూనిట్లలోపు కరెంట్కు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలే చెప్పారని.. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని.. అయితే పలు అంశాలపై ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని.. రూ.4 వేల పెన్షన్ కోసం వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా పెన్షన్ను రూ. 4 వేలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు అడుగుతున్నారని కవిత ప్రశ్నించారు. మళ్లీ దరఖాస్తులు కోరడం వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికి పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అన్నారు. రూ. 4 వేలు నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న చర్చ కూడా జరుగుతోందని.. దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదని అడిగారు.