కేసీఆర్ ప్రభుత్వాన్ని మోడీ సర్కారు కాపాడుతోంది - రేవంత్ రెడ్డి
X
కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలి అయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ కాళేశ్వరం సందర్శించి డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాదని, అవినీతిపై విచారణ జరపదని చెప్పారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ ప్రకారం కాకుండా వేరే రకంగా నిర్మాణం చేపట్టినందునే కుంగిపోయిందని విమర్శించారు. నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆగ్రం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో ఇన్ని లోపాలు బయటపడుతున్నా కేసీఆర్ ఇప్పటి దాకా ఎందుకు నోరు తెరవడం లేదని రేవంత్ నిలదీశారు.