Home > తెలంగాణ > అజరుద్దీన్‌కు ఒవైసీ షాక్.. రసవత్తరంగా జూబ్లీహిల్స్‌ ఫైట్

అజరుద్దీన్‌కు ఒవైసీ షాక్.. రసవత్తరంగా జూబ్లీహిల్స్‌ ఫైట్

అజరుద్దీన్‌కు ఒవైసీ షాక్.. రసవత్తరంగా జూబ్లీహిల్స్‌ ఫైట్
X

టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల గ్రౌండ్ పిచ్ చుక్కలు చూపించనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అజర్ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలతోపాటు తన సామాజిక వర్గానికే చెందిన ఎంఐఎం పార్టీతోనూ తలపడాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పటివరకు పాతబస్తీలోని 7 నియోజకవర్గాలకే పరిమితమైన మజ్లిస్ ఈసారి జూబ్లీహిల్స్‌తోపాటు రాజేంద్రనగర్‌లోనూ బరిలోకి దిగుతోంది.

మైనారిటీ ఓట్ల కోసం..

జూబ్లీహిల్స్‌లో ముస్లిం మైనారిటీ ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉండడంతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ పాగా వేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమాగా ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సొంత ఉనికి చాటుకోవడంతో పాటే బీజేపీని దెబ్బకొట్టేందుకు ఎంఐఎం బరిలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి, బీఆర్ఎస్‌ను గెలిపించే వ్యూహం కూడా దీని వెనక ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాము కలసికట్టుగా పోరాడతామని బీఆర్ఎస్, ఎంఐఎం తరచూ చెబుతుండమే దీనికి కారణం.

అజారుద్దీన్ హవా ఎంత?

గతంలో యూపీ నుంచి ఎంపీగా గెలిచిన అజారుద్దీన్ రాజకీయ గ్రాఫ్ చాన్నాళ్ల కిందటే పడిపోయింది. 2009లో మోరాదాబాద్ నుంచి తొలిసారి లోక్ సభకు పోటీ చేసి గెలిచిన ఆయన తర్వాత ఆ హవా కొనసాగించలేకపోయారు. 2014లో రాజస్తాన్‌లోని టోంక్ సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని ఆశించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన మెట్రో ఓటర్లను ఆకట్టుకోవడం అంత సులభం కాదు. నియోజక వర్గలో కొత్తగా పోటీ చేస్తుండడంతోపాటు బలంగా ఉన్న బీఆర్ఎస్‌ను, ఎంతో కొంత పోటీ ఇస్తుందని భావించే బీజేపీతోపాటు మైనారిటీలకు గాలం వేసిన ఎంఐఎంను కూడా దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చతుర్ముఖ పోటీలో గెలవడమో లేకపోతే రెండో స్థానంతో సరిపెట్టుకోడమో చేయాలంటే గడప గడపకు తిరగక తప్పదు. కాంగ్రెస్ నాయకత్వం అండగా నిలబడిన పార్టీ శ్రేణుల సహకారం. స్థానిక సమస్యలపై అవగాహన ఉండాలలి. ప్రజలకు భరోసా ఇవ్వగలిగేలా ప్రచారం సాగాలి. అజర్ ఈ అడ్డంకులన్నీ దాటుకుని విజయ శిఖరాలకు ఎలా చేరతారో తెలియాలంటే ఫలితాలు వెలువడే డిసెంబర్ 3 వరకు వేచి చూడాలి.


Updated : 3 Nov 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top