మరో 5 రోజుల్లో తెలంగాణకు 'నైరుతి' రాక.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
X
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుండగా.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఏపీవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఏపీకి రాకతో త్వరలోనే తెలంగాణను కూడా నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈ నెల 18వ తేదీలోపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం స్పష్టం చేసింది. 18న తాకిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో.. దాని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. గత కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తుండగా.. రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రానికి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఇక నేడు పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.