TSRTC: రికార్డ్ సృష్టించిన ఆర్టీసీ.. ఒక్కరోజే అరకోటి మంది..
X
సోమవారం ఆర్టీసీ రికార్డు సృష్టించింది. ఆ ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) మునిశేఖర్ వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు.
మొత్తం ప్రయాణికుల్లో 20.87 లక్షల మంది టికెట్లు తీసుకున్నారని , మిగతా 30 లక్షల మంది మహిళలే అని తెలిపారు. సోమవారం సగటున రూ.18.50 కోట్ల ఆదాయం వస్తుండగా ... ఉచిత ప్రయాణం వల్ల రూ.11.74 కోట్లే వచ్చాయని అధికారులు చెప్పారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.