డీకేతో భేటీ.. కాంగ్రెస్లోకి మోత్కుపల్లి..!
X
ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ అసంతృప్తులంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే వేముల వీరేశం, మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో మరో సీనియర్ నేత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింలు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. త్వరలోనే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరుతారని తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అటు కాంగ్రెస్ సైతం మోత్కుపల్లిని జాయిన్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డీకే - మోత్కుపల్లి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు, తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఒకసారి మోత్కుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభంలో మోత్కుపల్లి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ సారి ఆలేరు టికెట్ ఆశించారు. కానీ గులాబీ బాస్ ఆ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఇచ్చారు. అప్పటినుంచి బీఆర్ఎస్ తో అంటిముట్టన్నట్లు ఉంటున్న మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.