సీఏఏ అమలుపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
X
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర పౌరసత్వ సవరణ చట్టం-2019 సీఏఏ చట్టం అమలు చేయటంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేేంద్రం అమల్లోకి తెచ్చిన సీఏఏను కేరళ సీఎం పినరయి విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా ఆయన అభివర్ణించారు.తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చి చెప్పారు. మరోవైపు 'దేశంలో నేటి నుంచి సీఏఏను అమల్లోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం' అని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు.
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సోమవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా... సీఏఏ నిబంధనలను అయిదేళ్ల పాటు ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? ఇప్పుడు ఎన్నికలకు ముందు అమలు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని సూచించారు. ముస్లింలు లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్పీ-ఎన్ఆర్సీ తీసుకు వచ్చారని ఆరోపించారు.1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ను బీజేపీ సర్కారు తెరపైకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఏఏ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో కేంద్రం ప్రకటించింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.