ప్రజాపాలనపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ సమీక్ష
X
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా పాలన కార్యక్రమం ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాపాలన సన్నద్ధతపై సీడీఎంఏ హరిచందన, జేడీలు కృష్ణమోహన్‌రెడ్డి, శ్రీధర్‌తో పాటు ఇతర మున్సిపల్ శాఖ కమిషనర్లతో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సభలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన, వార్డు సభల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వార్డు సభల తేదీలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అన్నారు. వార్డు సభల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించడం, రసీదులు ఇవ్వడం, వాటిని కంప్యూటరీకరించడం వంటి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంపై రోజువారీ నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని కోరారు.