మైనంపల్లి రోహిత్‌కు పరాభవం తప్పదా? మెదక్ నుంచి పోటీ చేస్తే.. పరిస్థితి ఇదీ!
X
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకపక్క పార్టీలోనే ఉంటానని, సిట్టింగ్ స్థానం నుంచి పోటీచేస్తానని చెబుతున్న ఆయన మరోపక్క.. కొడుకు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తోంది. తిరగబడితే తీసి అవతల పడేస్తామన్న కేసీఆర్ హెచ్చరికతోపాటు కేటీఆర్, కవిత వంటి అగ్రనేతలు విరుచుకుపడినా మైనంపల్లి పట్టు వీడడం లేదు. సోమవారం మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన మంగళవారం కూడా మెదక్ సీటు విషయంపై మాట్లాడారు. తన కొడుకు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేసి తీరతాడని స్పష్టం చేశారు.
మెదక్ నుంచి ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చిన పార్టీ.. రోహిత్ పోటీ చేస్తే మైనంపల్లి తండ్రీకొడుకుల విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తికరం. మైనంపల్లిని మల్కాజ్‌గిరి నుంచి తప్పి ఆ స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి యాదవ్ లేదా, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్‌కు నిలబెడతారని తెలుస్తోంది. మైనంపల్లి పార్టీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ వైపు వెళ్లడం, లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకునే అవకాశం తెలుస్తోంది. ధనబలం ఉండడంతో తన గెలుపుకు ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నారు. మెదక్‌లోని తన అనుచరుల మద్దతుతో కొడుకును గెలిపించుకోవడం సులభమేనని అనుకుంటున్నారు. ఒకవేళ తండ్రీ కొడుకులు కాంగ్రెస్‌లో చేరితే ఆ పార్టీ టికెట్లు ఇస్తుందా అన్నది అంతుచిక్కని విషయం. మెదక్ నుంచి జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్‌గిరిలో గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు. దీంతో ఆ పార్టీ టికెట్‌కన్నా సొంత కరిజ్మాపైనే మైనంపల్లి నెట్టుకురావాల్సి ఉంటుంది. మల్కాజ్‌గిరి బరి నుంచి తలసాని సాయి, క్రిశాంక్‌లలో ఎవరో ఒకరు పోటీ చేసి గట్టిగా తలపడితే మైనంపల్లి గెలుపు కష్టం అవుతుంది.
మెదక్‌లో రోహిత్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా తక్కువే! పద్మా దేవేందర్ రెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతోనే గెలిచారు. ఉమ్మడి మెదక్ హరీశ్ రావుకు గట్టి పట్టు ఉండడంతో రోహిత్ ఇబ్బంది పడక తప్పదు. జిల్లాలోని మొత్తం 10 స్థానాలు బీఆర్ఎస్‌కే వస్తాయని హరీశ్ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. 25 ఏళ్ల కూడా లేని రోహిత్‌కు రాజకీయ అనుభవం లేదు. ఖరీదైన కార్లు, బైకుల్లో తిరుగుతూ రీల్స్ చేసుకుంటూ విలాసవంతమైన జీవితం గడిపే రోహిత్‌వైపు ప్రజలు మొగ్గు చూసే పరిస్థితి లేదని బీఆర్ఎస్ అంచనా. గెలవాలంటే కేవలం ధనబలం ఒక్కటే సరిపోదని, పేరు ప్రతిష్టలు, తెలంగాణ సెంటిమెంట్, అభివృద్ధి వంటి అంశాలన్నీ పనిచేస్తాయి కనక రోహిత్ పోటీ చేస్తే ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం ఖాయమని భావిస్తున్నారు. మైనంపల్లి తనతోపాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్‌లోనే ఉంటారా? కోపతాపాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లి తెరమరుగవుతారో ఆయన చాయిసేనని కేసీఆర్ సహా గులాబీ జెండా పార్టీలందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న సలహా, హెచ్చరిక.