మైనంపల్లి ఔట్... తలసాని సాయి ఇన్!
X
115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్ అసంతృప్తులు నిరాశపడొద్దని చెబుతూనే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘తిరగబడితే తీసి అవతల పడేస్తాం’’ అని తేల్చిచెప్పారు. దీంతో ‘టీ కప్పులో తుపాను’లా రేగిన మైనంపల్లి ఎపిసోడ్ చప్పున చల్లారింది. తను పార్టీ చెప్పినట్లు నడుచుకుంటానని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ప్రకటించారు. అయితే మెదక్ నుంచి పోటీ చేసే విషయాన్ని తన కొడుకు రోహిత్‌కు వదిలేస్తున్నానని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆయన ఇంకా దారికి రాలేదని అధిష్టానం భావిస్తోందని, కఠిన చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మల్కాజిగిరి నుంచి ఆయనను తప్పించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయిని బరిలోకి దింపే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. తండ్రీకొడుకులకు టికెట్ ఫార్మాలా మైనంపల్లి విషయంల కుదరనప్పుడు తలసాని తండ్రీకొడుకులకు ఎలా వర్తిస్తుందనే విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే పార్టీ కార్యకలాపాల కింద మైనంపల్లి టికెట్‌కే ఎసరొచ్చి బీ ఫామ్ కూడా దక్కకపోవచ్చని చెబుతున్నారు.
మైనంపల్లి హనుమంత రావు తనతోపాటు ఈసారి మెదక్ నుంచి పోటీ చేయడానికి తన కొడుకుకు కూడా టికెట్ ఇవ్వాల్సిందేనని సోమవారం తిరుమలలో చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపాయి. మంత్రి హరీశ్ రావు తమకు అడ్డుపడుతున్నారని ఆయన అనుచిత వ్యాఖ్యాలు చేశారు. దీంతో కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహా పలువురు పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తొలి నుంచి పార్టీలో ఉన్న హరీశ్ రావు వెంటే తాము ఉన్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘మా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. పార్టీ ప్రారంభం నుంచి హరీశ్ రావు వ్యవస్థాపక సభ్యుడు. పార్టీ మూలస్తంభాల్లో ఒకరైన ఆయనకు అండగా ఉంటాం’’ అని అన్నారు. పార్టీ అగ్రనేతల్లో ఒకరైన హరీశ్ రావుపై మైనంపల్లి పరుష వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం విరుచుకుపడుతోంది. పార్టీ నుంచి లబ్ధి పొంది, తల్లి రొమ్మునే గుద్దుతావా అంటూ శ్రేణులు దుయ్యబడుతున్నాయి. సిద్దిపేట సహా పలు చోట్ల మైనంపల్లి దిష్టిబొమ్మలను కాల్చేస్తున్నారు.
రోహిత్ తీరుపై అభ్యంతరాలు!
నిండా 25 ఏళ్లు లేని మైనంపల్లి రోహిత్‌కు టికెట్ సాధ్యం కాదని తెలిసినా తండ్రి పట్టుదలతో ప్రయత్నించారు. రోహిత్ కోట్ల విలువైన కార్లలో, బైకులపై తిరుగుతూ, విలాసవంతమైన జీవిత శైలితో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం, రీల్స్ పెట్టడం తప్ప ప్రజల్లోకి వెళ్లిన దాఖలా కూడా లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అంతేకాకుండా మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మళ్లీ టికెట్ ఖాయమని తెలిసినా హనుమంత రావు ఆ స్థానాన్ని తన కొడుక్కు ఇవ్వాలని పట్టుబట్టడం పార్టీ నేతలను విస్మయపరిచింది. కేసీఆర్ ప్రెస్ మీట్‌లో హనుమంత రావు విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఆయనకు ఇష్టం ఉంటే పోటీ చేస్తారు లేకపోతే లేదు. అభ్యర్థుల మార్పులు, చేర్పులు కూడా ఉంటాయి. పార్టీని నమ్ముకుని ఉంటే వాళ్లకు పదవులు వస్తాయ. ఏదో పదవి ఉందని, డబ్బులు ఉన్నాయని నోరు పారేసుకుంటే చీరేస్తాం’’ తీవ్రంగా హెచ్చరించారు. మైనంపల్లి వివాదాన్ని కొనసాగితే ఆయనపై వేటు తప్పదనేందుకు ఇది సంకేతమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సీఎం హెచ్చరికతో మైనంపల్లి కాస్త తగ్గినా కొడుకు విషయంలో మాత్రం ఏదో వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
వేటు తప్పదా?
మైనంపల్లి దారిలోకి వచ్చినట్లు కనిపిస్తున్నా కొడుకు విషయంలో మొండిగా ఉండడంతో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముంది. రోహిత్ మెదక్ నుంచి పోటీ విషయాన్ని అతనికే వదిలేస్తున్నానంటూ హనుమంత రావు మెలిక పెట్టడంతో ఆయనపై వేటు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. జాబితాలో చిన్నపాటి మార్పుచేర్పులు ఉండొచ్చన్న కేసీఆర్, మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే సందర్భంలో అప్పటి పరిస్థితిని బట్టి కఠిన నిర్ణయమే తీసుకుంటారని సమాచారం. మైనంపల్లిని తప్పించి పార్టీ కోసం కష్టపడుతున్న తలసాని సాయి, క్రిశాంక్‌లో ఎవరినో ఒకరిని బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది.