సీఎం కేసీఆర్కు మైనంపల్లి లేఖ.. పార్టీలో..
X
సీఎం కేసీఆర్కు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు లేఖ రాశారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి.. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను తిరస్కరిస్తూ గులాబీ బాస్కు లేఖ రాశారు. ఆ లేఖలో తాను పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తెలిపారు. తన సపోర్టర్స్, నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినట్లు లేఖలో తెలిపారు.
2014లో తాను పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క కార్పొరేటర్ కూడా లేరని మైనంపల్లి అన్నారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీ రోల్ పోషించా. నా కష్టాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనయ్యాను. పార్టీలో ప్రజాస్వామ్యం, పారదర్శకత లోపించింది. పార్టీ కష్టపడి పనిచేసే వారి అభిప్రాయాలను అధిష్టానం గౌరవించడం లేదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడమే దీనికి నిదర్శనం ’’ అని మైనంపల్లి అన్నారు.
అంతేకాకుండా పార్టీలోని కొందరు సీనియర్లు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మైనంపల్లి ఫైర్ అయ్యారు. అధికారం దాహంతో ఉన్న కొంతమంది చేతిలో కీలుబొమ్మగా మారి పార్టీలో కొనసాగలేనని అన్నారు. తన రాజీనామాను ఆమోదించడంతోపాటు పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తనను తప్పించాలని లైకలో మైనంపల్లి కోరారు.