బీఆర్ఎస్పై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
X
సొంత పార్టీ నేతలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్లో తాను అణిచివేతకు గురయ్యానని చెప్పారు. వారం తర్వాత ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తానని అన్నారు. మెదక్, మల్కాజ్ గిరి నియోజకవర్గానికి చెందిన అనుచరులతో మైనంపల్లి భేటీ అయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మెదక్ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ప్రజాతీర్పుపై గెలిచానని స్పష్టం చేశారు.
మనిషి ఆశాజీవి అని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటాడని మైనంపల్లి అన్నారు. తాను అందరినీ సమానంగా చూస్తానని, కిందపడ్డా, పైనపడ్డా లక్ష్యంవైపు ప్రయాణిస్తానని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు. తన కన్నా తన కొడుకే ఎక్కువ పనిచేస్తున్నారని మైనంపల్లి చెప్పారు.