Telangana Congress: కాంగ్రెస్కు మరో షాక్.. గుడ్ బై చెప్పనున్న సీనియర్ నేత..?
X
కాంగ్రెస్ పార్టీకి మరో నేత షాకిచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్కు చెందిన సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి పార్టీ వీడనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆయనకు హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నాగం రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరే అవకాశమునట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఆదివారం సాయంత్రం నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న మంత్రి కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ను పార్టీ హైకమాండ్ రాజేష్ రెడ్డికి కేటాయించింది. దీంతో నాగం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఐదుసార్లు విజయం సాధించిన తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకుండా మనోభావాలు దెబ్బతీసిందని నాగం మండిపడుతున్నారు. పార్టీలో కష్టపడే వారికి టికెట్ ఇవ్వకుండా ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.