Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ టైటిల్కు న్యాయం చేసిందా..? కథ రొటీన్ గా ఉందా? హిట్ పడిందా?
X
టైటిల్: నా సామిరంగ
తారాగణం : నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, నాజర్, రావు రమేష్ తదితరులు
ప్రొడక్షన్ హౌస్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రొడ్యూసర్ : శ్రీనివాస చిట్టూరి
డైరెక్టర్: విజయ్ బిన్ని
కథ: ప్రసన్నకుమార్ బెజవాడ
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
విడుదల తేది: జనవరి 14, 2024
గ్రామీణ నేపథ్యంలో సాగే కిష్టయ్య లాంటి పాత్రలు చేయడం నాగార్జునకు కొట్టిన పిండి. పైగా సంక్రాంతి నాగార్జునకు అచ్చొచ్చిన సీజన్. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు లాంటి హిట్టైన సినిమాలు వచ్చింది ఈ సీజన్ లోనే. ఆ లిస్ట్ లో ఇప్పుడు నా సామిరంగ కూడా చేరిపోయింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ.. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నాడు. విడుదలకు ముందు నా సామిరంగ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్, ట్రైలర్, టీజర్లతో అభిమానుల్లో హైంప్ పెంచారు. అయితే ఆ హైప్ కు నా సామిరంగ రీచ్ అయిందా.. అసలు సినిమా కథేంటో చూద్దాం..
కథ ఏంటంటే:
సినిమాలో నాగార్జున పాత్ర పేరు కిష్టయ్య. అల్లరి నరేష్ అంజి. కిష్టయ్య అనాథ. దాంతో చిన్నప్పుడే అంజి తల్లి అతన్ని చేరదీస్తుంది. ఇక అప్పటినుంచి ఆ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. తల్లి చనిపోవడంతో.. ఆ ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) అండగా నిలబడతాడు. ఈ క్రమంలో కిష్టయ్య 12 ఏళ్లప్పుడు వరాలు (ఆషికా రంగనాథ్) ప్రేమలో పడతారు. అయితే పై చదువులకు పట్నం వెళ్లిన వరాలు.. 15 ఏళ్ల తర్వాత తిరిగొస్తుంది. అయితే వీళ్లిద్దరి ప్రేమ మళ్లీ మొదలవుతుంది. ఈ విషయాన్ని పెద్దయ్యతో చెప్పేందుకు వెళ్లగా.. అప్పటికే వరాలు వాళ్ల నాన్న వరదరాజులు (రావు రమేష్).. తన కూతుర్ని పెద్దయ్య కొడుకు దాసు (షబ్బీర్)కిచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుతుంటారు. అయితే.. వీళ్ల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దయ్య.. పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. కానీ వరదరాజులుకు మాత్రం వరాలును కిష్టయ్యకు ఇచ్చి చేయడం ఇష్టం ఉండదు. మరి ఆ తర్వాత ఏమైంది? వీరి ప్రేమ పీటలెక్కుతుందా? ఈ స్టోరీలో భాస్కర్ (రాజ్ తరుణ్), కుమారి (రుక్సార్)లు ఎందుకొస్తారు? అనేది కథ. స్టోరీ పూర్తిగా తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
కథ ఎలా సాగిందంటే:
నా సామిరంగ మలయాళ సినిమా రీమేక్ అయినా.. ఎక్కడా అలా అనిపించడదు. తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లు స్టోరీని మలచడంలో రైటర్ ప్రసన్న కుమార్, డైరెక్టర్ విజయ్ బిన్నీ సక్సెస్ అయ్యారు. స్నేహం.. ప్రేమ.. విధేయత.. ప్రతీకారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న కథ నా సామిరంగ. ఇలాంటి కథతో తెలుగు సినిమాలు చాలానే ఉన్నా.. 1980ల నాటి కోనసీమ బ్యాక్ డ్రాప్ తో కాస్త కొత్తగా అనిపిస్తుంది. కోనసీమ యాసను యాక్టర్లు దించేశారు. సినిమాలో నాగార్జున ఎంట్రీ సీన్.. కిష్టయ్య- వరాలు రొమాన్స్.. యాక్షన్ సీన్స్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగార్జున ఎలివేషన్ షాట్స్ సినిమాకు ప్లస్. ఇక క్లైమాక్స్ లో నాగ్ యాక్షన్ హంగామా ఆయన అభిమానులకు హైప్ ఎక్కిస్తుంది.
ఎవరెలా చేశారు:
కిష్టయ్య గెటప్ లో నాగ్ ఒదిగిపోయాడు. నాగ్ ను చూపించిన తీరు, యాస, గెటప్ అన్నీ సెట్ అయ్యాయి. నాగార్జున ప్రతీ సీన్ ప్రేక్షకులతో నా సామిరంగా అనిపించేలా ఉంటాయి. ఇంటర్వెల్ లో శివ సినిమాలో లాగ నాగ్ సైకిల్ చైన్ పట్టుకునే సీన్ తో థియేటర్స్ లో అరుపులు మొదలవుతాయి. తనపై వస్తున్న ఆయుధాలతో బీడీ వెలిగించుకున్న షాట్ కు హై లెవల్ ఎలివేషన్ ఉంటుంది. గమ్యం సినిమాలో గాలి సీను లాంటి గుర్తుండిపోయే పాత్ర అంజి. ఆ పాత్రకు అల్లరి నరేశ్ న్యాయం చేశాడు. వరాలుగా అషికా చక్కగా చేసింది. సినిమాలో షబ్బీర్ విలనిజం ఆకట్టుకుంటుంది. మిగతావాళ్లు వారి పాత్రలకు తగ్గట్లు బెస్ట్ ఇచ్చారు. కథలో కొత్తదనం లేకపోయినా.. సంక్రాంతికి మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. కీరవాణి పాటలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నాగార్జున, అల్లరి నరేశ్ యాక్టింగ్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ ఎపిసోడ్స్
పాటలు
మైనస్ పాయింట్స్ :
కొత్తదనం లేని కథ
నెమ్మదిగా సాగే కథనం
ఫైనల్ గా : సంక్రాంతి పడక్కి మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే సినిమా నా సామిరంగ.