Marri Janardhan Reddy:గులాబీ బాస్ కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్‌లోకి మర్రి జనార్థన్ రెడ్డి.?
X
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, గులాబీ అధినేత కేసీఆర్(KCR) ఆస్పత్రి పాలవ్వడం.. వంటి వరుస ఘటనలతో బీఆర్ఎస్ పార్టీలో కాస్త లుకలుకలు మొదలయ్యాయనే టాక్ గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా తుంటి ఎముక విరగడంతో కేసీఆర్ ఆస్పత్రి పాలై, ఆ తర్వాత తన నివాసంలో విశ్రాంతి తీసుకునే సమయంలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడంతో.. ఇక వారంతా పార్టీని వీడుతున్నారనే అనుకున్నాయి మిగిలిన పార్టీలు. ఆ తర్వాత వారంతా తమ నియోజకవర్గాల సంక్షేమం కోసమే కలిశామని చెప్పినా.. ఎక్కడో ఏదో సందేహం. అందుకు ప్రధాన కారణం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) మాకు టచ్ లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు వ్యాఖ్యానించడమే. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఓ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఒకరు గులాబీకి గుడ్ బై చెప్పి, హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాడు కాల్చిపడేస్తా.. నేడు గెలిచి చూపిస్తా.!
ఆయన మరెవరో కాదు.. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తా.. ఒక్కొక్కరిని కాల్చి పడేస్తా అని బెదిరించిన నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి (Marri Janardhan Reddy) . గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి , కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డిపై స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయోమయంలో కార్యకర్తలు..!!
మల్కాజ్‌గిరి నుంచి మర్రి పోటీ చేయాలనుకుంటున్నారని.. అందుకోసం ఎంపీ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీతో మంతనాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓకే అంటే.. వెంటనే మూడు రంగుల కండువా కప్పుకొని హస్తం పార్టీ నుంచి పార్లమెంట్ బరిలో ఉండనున్నారు. అయితే మర్రి పార్టీ మారుతున్నారన్న సమాచారంతో నాగర్ కర్నూలు జిల్లా బీఆర్‌ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు.
శుక్రవారం అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన మర్రి జనార్దన్‌రెడ్డి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎంపీ టికెట్ కష్టమేనని భావిస్తున్నందుకే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.