Nagoba Maha Jatara : నేటి నుంచి నాగోబా మహా జాతర
X
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఉత్సవమైన నాగోబా జాతర నేటి నుంచి అత్యంత వైభవంగా సాగనుంది. మేడారం తర్వాత అంతటి పేరుగాంచిన జాతర ఇది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర సర్కారు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు అర్థరాత్రి మహాపూజతో జాతర ప్రారంభంకానుండగా.. మూడు రోజులపాటు ప్రత్యేక పూజల అనంతరం జాతర ముగియనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా జాతర నేడు ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు ఇప్పటికే 220 కిలో మీటర్లు దూరం కాలినడక వెళ్లి పవిత్ర గోదావరి జలాన్నితీసుకోచ్చారు. ఆ జలంతో ఇవాళ అర్థరాత్రి నాగోబాకు పూజ చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 15 వరుకు కొనసాగే ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా,కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, ఏపీ నుంచి భక్తులు తరలివస్తారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని నేటి రాత్రి 10.30 గంటలకు పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రం వంశీయులు..అనంతరం మహాపూజతో అర్థరాత్రి 12 గంటలకు నాగోబా తొలిదర్శనం ఇవ్వనుంది..ఈ నెల12న గిరిజన మహా దర్బార్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం. ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు..ఆలయం దగ్గర బారికేడ్లు పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయగా..నాగోబా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి, కోనేరును శుభ్రపరిచారు.. జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు..మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు.పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న ఉత్సవం కావడంతో ప్రతిష్మాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు