Huzur Nagar: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా సూర్యాపేట పరిధిలోని హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి కాంగ్రెస్ పార్టీలో చేరి.. అధికార పార్టీ బీఆర్ఎస్‌కు షాకిచ్చారు. అర్చనతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు గాయత్రి, గంగాభవాని, అమరబోయిన సతీష్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం అర్చన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గం లో ఉప్పెన లాగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని... బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను సహించలేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని.. వారి రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఎట్టకేలకు హుజూర్ నగర్ మున్సిపాలిటీ హస్తం మయం కావడంతో కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్తేజం వెల్లివిరిసింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఎంతో సపోర్టుగా ఉన్న మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన, ఆమె భర్త రవికుమార్‌లు ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడం అందరికీ షాక్‌నిచ్చింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవరు బహిరంగంగా వ్యతిరేకించకపోయినా ఎన్నికల సమీపిస్తున్న వేళలో ఆ పార్టీలో ఉన్న అసంతృప్తివాదులు ఎమ్మెల్యే వైఖరికి అడ్డు చెప్పలేక కాంగ్రెస్ లోకి చేరుతున్నారని టాక్. పోలీసులను అడ్డం పెట్టుకొని సైదిరెడ్డి తనకిష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ లోకి చేరుతున్న వారి ఆరోపణ. ఆయనకు ఎవరైనా అడ్డు చెబితే అక్రమ కేసులు పెట్టడమే కాకుండా మానసికంగా ఇబ్బందులు పెడతారని అంటున్నారు.