లోన్ యాప్స్ల అప్పులు తీర్చేందుకు.. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మకం
X
న్యూఇయర్ వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఆదివారం నగరంలోని జూబ్లీహిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నవీన్, సాయి తేజ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న.. పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రగ్స్ విక్రయిస్తున్న వీరిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను సీజ్ చేశారు. కాగా వీరిద్దరు లోన్ యాప్ ల ద్వారా భారీ అప్పులు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
ఈ అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకోవాలని నవీన్, సాయి భావించారు. అయితే వీరి ప్లాన్ ను అట్టర్ ప్లాప్ చేశారు పోలీసులు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో కఠిన అంక్షలు విధించారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే నగరంలోని పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు.