హరియాణా నూతన సీఎంగా నయబ్ సింగ్ సైనీ
X
హరియాణా నూతన ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయబ్ సింగ్ సైని బాధ్యతలు చేపట్టనున్నారు. మనోహర్ ఖట్టర్ ఈ రోజే సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఆయన కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. నాయబ్ సైనీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ ఇవ్వనున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో హర్యానా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.నాయబ్ సైనీ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. గత ఏడాది బీజేపీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.
1996 నుంచి బీజేపీలో క్రమంగా ఎదిగారు. 2002లో బీజేపీ అంబాలా జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలా జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో బీజేపీ హర్యానా రాష్ట్ర కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో నారాయణగఢ్ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2016లో మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో చేరారు. 2019లో కురుక్షేత్ర నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు.శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుభాష్ సుధా తెలిపారు. సైనీ పేరును ప్రతిపాదించగా, ఆ మీటింగ్ నుంచి అనిల్ విజ్ వెళ్లిపోయారు. కొత్త క్యాబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి దక్కడం అనుమానంగానే ఉన్నది.లోక్‌సభ ఎన్నికల కోసం జరిగిన సీట్ల పంపకం విషయంలో బీజేపీ, జననాయక్ జనతా పార్టీ మధ్య చీలకలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాని వల్లే మనోహర్ లాల్ ఖట్టర్ .. సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.