Home > తెలంగాణ > హెచ్చరించినా పట్టించుకోలేదు.. చెప్పుకునే దిక్కులేదు.. ఈ క'న్నీటి' గాథకు కారణం ఎవరు?

హెచ్చరించినా పట్టించుకోలేదు.. చెప్పుకునే దిక్కులేదు.. ఈ క'న్నీటి' గాథకు కారణం ఎవరు?

హెచ్చరించినా పట్టించుకోలేదు.. చెప్పుకునే దిక్కులేదు.. ఈ కన్నీటి గాథకు కారణం ఎవరు?
X

అర్ధరాత్రి వేళ భారీ వాన.. వరదనీటితో పొంగి పొర్లిన ఊరి పక్క వాగు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భారీ వరదలో మునిగిన గ్రామం.. ఆ ఊరే మోరంచపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. ఏకంగా ఓ గ్రామమే వాన నీటికి మునిగిపోవడం ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లాలోని పరకాల సమీపంలో ఉన్న ఈ గ్రామమేమీ మారుమూల పల్లెటూరు కాదు. జాతీయ రహదారిపైనే ఉన్న ఈ గ్రామం నుంచే పలు రాష్ట్రాలకు, జిల్లాలకు రాకపోకలు కొనసాగుతాయి. అలాంటి ఈ ఊరికి ప్రతీ ఏటా వానగండం పొంచే ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం ఆ గండం నుంచి గట్టెక్కలేకపోయింది. తెల్లవారిలేచి చూసేసరికి వాకిలి మొత్తం వాగులా మారడంతో.. గ్రామస్తులంతా ఏం చేయాలో తెలియక ప్రాణాలు దక్కించుకోవడానికి కొందరు డాబాలు ఎక్కి , మరికొందరు సమీపంలోని ఎత్తైన చెట్లు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

1500 మంది జనాభా ఉండే మోరంచపల్లి గ్రామం పక్కనే మోరంచ వాగు ప్రవహిస్తుంటుంది. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ పక్కనే ఉండే గణప సముద్రం చెరువు అలుగు పోస్తుండటంతో.. ఆ వరదంతా మోరంచ వాగులోకి వచ్చి.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊరంతా నీట మునిగింది. గ్రామస్థులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం అర్థిస్తున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అప్రమత్తం చేశారు. మరోవైపు మోరంచపల్లి గ్రామంలో సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ఈ ఉదయం అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ​గ్రామంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్​ను తరలించాలని ప్రభుత్వ సీఎస్ శాంతికుమారికి సూచించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ ఇంకా సంప్రదింపులే జరుపుతున్నారు. అధికారుల ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే గ్రామానికి చేరుకుని.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు.

అయితే ఈ విషయంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించారన్న విమర్శలొస్తున్నాయి. ఒక ఊరే మునిగిపోయేంత ప్రమాదం పొంచిఉన్నప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఎందుకు లేదన్న సంగతి ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వెయ్యి మంది జనాభా ఉన్న ఆ గ్రామం చుట్టూ ప్రస్తుతం రెండు కిలోమీటర్ల మేర నీరు నిలిచిపోతే..ఇప్పుడు సహాయక చర్యలు అంటూ పరుగులు పెట్టడం ఏంటన్న ప్రశ్నలొస్తున్నాయి. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తక్షణమే మోరంచపల్లి హెలికాప్టర్ సేవలు అందించాలన్న ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎడతెరపి లేని ఈ వానల్లో హెలికాప్టర్ ప్రయాణం సాధ్యమేనా.. ఒకవేళ అక్కడివరకూ వెళ్లినా.. అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కుదిరే పనేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా అధికారయంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు ఉందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముందే జాగ్రత్త పడితే ఇప్పుడు మోరంచపల్లె ప్రజలు ఈ గండం నుంచి గట్టెక్కేవారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు భూపాలపల్లి జిల్లాకు కూడా వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందే హెచ్చరించినా.. జిల్లాలోని ఈ గ్రామం గురించి తెలిసి కూడా అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.



Updated : 27 July 2023 2:20 PM IST
Tags:    
Next Story
Share it
Top