బీఆర్ఎస్కు కేసీఆర్ సన్నిహితుడి రాజీనామా
X
బీఆర్ఎస్కు నిర్మల్ జిల్లాకు చెందిన కీలక నేత గుడ్ బై చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన కూచాడి శ్రీహరిరావు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము ముందుండి పోరాడమని.. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్లో తగిన గుర్తింపు దక్కలేదని శ్రీహరిరావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తుందని.. అటువంటి మోసాలు చూడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహార శైలితో కొంతకాలంగా శ్రీహరి రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలని సూచిస్తే.. మంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తన సొంత ఊరిలో కార్యక్రమాలు నిర్వహించారని మండిపడ్డారు. 2018లో ఇంద్రకరణ్ రెడ్డి కోసం టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని శ్రీహరి రావ్ విమర్శించారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారన్ని శ్రీహరి రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరే తేదీని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 2007లో శ్రీహరిరావు టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. పలు బహిరంగ సభల్లో శ్రీహరిరావుతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. గతంలో ఆయన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు.