MP Arvind : రేవంత్ కుర్చీ కోసం.. ఆ ఇద్దరూ కాచుకొని కూర్చున్నారు.. అర్వింద్ సంచలన కామెంట్స్
X
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ ఒక్కటే అని అన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. వీరిద్దరూ కలిసే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు ఒక అభ్యర్థిని డిసైడ్ చేయడం కాదని.. స్వయంగా వారిద్దరిలో ఒకరు పోటీ చేసినా తామే గెలుస్తామని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఎంపీ అర్వింద్... పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందో.. పోతుందో కూడా తెలియని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాక్కుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డే కాదు.. ఆ కుర్చీ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నాడని అన్నారు. రైతుబంధు నిధుల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.2 వేల కోట్లు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రూ.3 వేల కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. 14 సీట్లకు పైనే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. . కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ రాబోతోందని జోస్యం చెప్పారు. హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేశారు. కావాలనే ఎన్నికల వేళ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రెండు రోజుల క్రితం కూడా వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఓటువేయకుంటే దేశద్రోహులే అని షాకింగ్ కామెంట్స్ చేశారు అర్వింద్. సోమవారం కోరుట్లలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఇండియా కూటమి నుంచి పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ఆ తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన భీమ్ విజయ సంకల్ప యాత్రలోనూ బీజేపీకి ఓటు వేయకుంటే నరకానికి పోతారని వ్యాఖ్యానించారు.