హైదరాబాద్ టూ ఖమ్మం ర్యాలీ.. కాంగ్రెస్లో చేరనున్న తుమ్మల..?
X
ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. హైకమాండ్ తననికాదని కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తుమ్మల పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఆయన అనుచరులు సైతం పార్టీ మారి పాలేరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో తుమ్మల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తుమ్మల నాగేశ్వరరావు దాదాపు వెయ్యి కార్లతో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ర్యాలీగా బయలుదేరారు. అయితే ఈ ర్యాలీలో ఒక్క బీఆర్ఎస్ జెండా కూడా కనిపించకలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ తో ఇప్పటికే చర్చలు ముగిశాయని, త్వరలోనే ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎప్పటినుంచో తుమ్మల ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
తుమ్మల వేరే పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ దెబ్బతినే అవకాశముండటంతో పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు తుమ్మలతో భేటీ అయ్యారు. తొందరపడొద్దని, పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరారు తుమ్మల మాత్రం కాంగ్రెస్ లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.