హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
X
హైదరాబాద్లో వాహనదారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. లారీ, ట్రక్ డ్రైవర్లు సమ్మెతో పెట్రోల్ పంపులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూకట్టారు. గంటల తరబడి వేచిచూసి మరీ పెట్రోల్ తీసుకుంటున్నారు. ఒక్కసారిగా వాహనదారులు పెరగడంతో హైదారాబాద్ లోని పలు పెట్రోల్ పంపుల్లో స్టాక్ అయిపోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ లేకపోవడంతో పెట్రోల్ పంపుల యజమానులు బంకులు క్లోజ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్రిమినల్ కోడ్లో హిట్ అండ్ రన్ కేసుల్లో జైలు శిక్ష పదేండ్లకు పెంచడంతో పాటు జరిమానా మొత్తాన్ని రూ.7లక్షలకు పెంచింది. ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. ఎక్కడికక్కడ ట్రక్కులు, లారీలు నిలిపేసి ఆందోళనకు దిగారు. దీంతో పలు రాష్ట్రాలకు రావాల్సిన పెట్రోల్, డీజిల్ నిలిచిపోయింది. డ్రైవర్ల సమ్మె మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముండటంతో చాలా మంది వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా చాలా పెట్రోల్ పంపుల్లో ఇంధనం అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.