Sonia Gandhi: ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు.. సోనియా గాంధీ
X
141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. 'సేవ్ డెమోక్రసీ' అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ... చట్టబద్ధమైన డిమాండ్ చేసినందుకు కేంద్రప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంతమంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయలేదన్నారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్ చేసిన ప్రతిపక్ష ఎంపీలపై ఇలా వేటు వేయలేదని సోనియా పేర్కొన్నారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలని మాత్రమే ఎంపీలు అడిగినట్లు చెప్పారు. అయితే ఎంపీల అభ్యర్థనపై ప్రభుత్వం వ్యవహరించిన అహంకారాన్ని చెప్పటానికి పదాలు లేవని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ విషయమై ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్లమెంటులో జరిగిన అలజడి ఘటనపై స్పందించడానికి ప్రధాని మోదీకి నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు. అది కూడా ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారన్నారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని తీవ్రస్థాయిలో మడి పడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ అపహాస్యం చేసిందన్నారు ఎంపీ శశిథరూర్. ప్రజాస్వామ్య చరిత్రలో ప్రపంచంలోని ఏ దేశంలోనూ 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరగలేదన్నారు. పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై హోం మంత్రి వివరణ ఇవ్వాలని విపక్షాలు కోరినా ఆయన పార్లమెంట్‌కు రాలేదన్నారు. ప్రతిపక్షాన్ని బాధ్యతాయుతంగా పనిచేయనివ్వడంలో ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఆరోపించారు.