కండక్టర్ ఓవరాక్షన్.. ఉద్దేశపూర్వకంగా కాదంటున్న TSRTC
X
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న(ఆదివారం) నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టీఎస్‌ఆర్టీసీ బస్సు కండక్టర్.. మహిళకు టికెట్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్-బోధన్ రూట్ పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక ప్రయాణికుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆ ప్రయాణికుడు ముగ్గురికి బోధన్ టికెట్ ఇవ్వమని అడగడంతో రూ.30 చొప్పున ముగ్గురికి రూ.90 టికెట్‌ను కండక్టర్ జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత ఆ ప్రయాణికుడు కండక్టర్ వద్దకు వచ్చి మహిళలకు ఉచితం కదా.. టికెట్ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. ఓ ప్రయాణికుడు గమనించి కండక్టర్ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దాకా వెళ్లింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించామని, సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగిందని, విచారణ అనంతరం సదరు కండక్టర్ పై ఆర్టీసీ సంస్థ శాఖపరమైన చర్యలను తీసుకుంటుందని సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. కండక్టర్ నర్సింహులు ఉద్దేశ్యపూర్వకంగా టికెట్ జారీ చేయలేదని, టిక్కెట్ అడిగిన వ్యక్తితో సహ మిగిలిన ఇద్దరు కూడా పురుషులే అనుకుని టికెట్ ను జారీ చేసినట్లు తెలిపారు. నర్సింహులు అనబడే సదరు కండక్టర్ అన్యత భావించవద్దని కూడా సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అయితే సోషల్ మీడియాలో ఈ విషయంపై వివిధ రకాలుగా సర్క్యూలేట్ అవుతుండటంతో మరోసారి ఉన్నతాధికారులు విచారణ చేయనున్నారు.