Home > తెలంగాణ > కోతులకు భయపడి బావిలో దూకిన వృద్ధురాలు.. ఆ తర్వాత..

కోతులకు భయపడి బావిలో దూకిన వృద్ధురాలు.. ఆ తర్వాత..

కోతులకు భయపడి బావిలో దూకిన వృద్ధురాలు.. ఆ తర్వాత..
X

అడువుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి చేరాయి. గ్రామాలనే ఆవాసంగా చేసుకుని ప్రజలను భయపెట్టిస్తున్నాయి. కోతులు చేసే వీరంగానికి ప్రజలు ఆస్పత్రులపాలు అయిన ఘటనలు లేకపోలేదు. మనుషులపై దాడులు చేస్తూ దర్జాగా తిరుగుతున్నాయి. తాజాగా కోతుల భయానికి ఓ వృద్ధురాలు బావిలో దూకింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగింది.

రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రాజవ్వ అనే వృద్ధురాలు కూరగాయలు అమ్ముతూ ఒంటరి జీవనం సాగిస్తోంది. శనివారం ఇంటి బయట ఆమెపై కోతులు దాడి చేశాయి. దీంతో భయపడిన ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేసింది. మధ్యలో రాయిపై నిలబడి రక్షించమంటూ కేకలు వేసింది. స్థానికులు తాడుసాయంతో ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

వారం రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై కోతులు దాడి చేశాయి. ఈ దాడిని తప్పించుకునే ప్రయత్నంలో అతడి కాలు, చెయి విరిగాయి. దీంతో మూడు నెలలు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మనుషులపై దాడులకు తెగబడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అధికారులు స్పందించి కోతుల బెడదను తప్పించాలని బొప్పాపూర్ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated : 6 Aug 2023 6:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top