నెలరోజుల్లో పడాల్సిన వాన ఒక్కరోజులోనే పడింది
X
హైదరాబాద్ కు వర్షాకాలం ఒక్క ఉదుటన వచ్చేసింది. జూన్ లోనే సీజన్ మొదలైనా...మొదట్లో వర్షాలు పెద్దగా పడలేదు. జులై వచ్చాక కూడా ఎండలు దంచికొట్టాయి. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ ను వానలు ముంచెత్తుతున్నాయి. ఎంతలా అంటే నెలరోజుల్లో పడాల్సిన వర్షం ఒక్కరోజులోనే పడిపోయింది. ఇది ఒక్క గురువారం పరిస్థతి మాత్రమే. ఇదే పరిస్థితి మరో నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం సాయంత్రం 6గంటల వరకు దాదాపు 188.3 మి.మీ పడింది.హైదరాబాద్ వాతావరణశాఖ రికార్డుల ప్రకారం 1991 నుంచి 2020 వరకు 30 ఏళ్ళల్లో జులై నెల సగటు వర్షపాతం 162 మి.మీగా ఉంది. గురువారం అంతా దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. మియాపూర్ చుటుటపక్కల ప్రాంతాల్లో అధికంగా 99.8 మి.మీ వాన పడింది. జులై నెలలో 11ఏళ్ళ క్రితం అత్యధికంగా 2012లో 115.1 మి.మీగా నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంతలా వర్షం కురిసింది.
మరోవైపు మొత్తం తెలంగాణ అంతా కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో మూడు రోజులు ఇలాగే వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది.