Onion Price Hike: సామాన్యుడికి మళ్లీ చుక్కలే.. కూరగాయల ధరలు పైపైకి
X
ఉల్లిపాయలు, టమాటా ధరలు సామాన్యులకు మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. గత వారంగా వీటి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. రుతుపవనాల ఆలస్యం కారణంగా సాగు తగ్గడంతో దేశవ్యాప్తంగా ఉల్లి, టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఈనెల ప్రారంభంలో కిలో ఉల్లి ధర రూ.25 నుంచి 30 ఉండగా, ప్రస్తుతం రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. మరో వైపు కిలో టమాటా ధర 15 నుంచి 30కి చేరింది. కొన్నిచోట్ల వాటిని ఇంకా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లి ధర రూ.100 పలికే అవకాశం ఉంది.
దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. 15 రోజులుగా, నిల్వ ఉంచిన ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% తగ్గాయని అంటున్నారు. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక టమాటా ధరలు కూడా పెరగడానికి మరో కారణం.. రైతులు క్రమంగా దాని సాగు తగ్గించుకోవడమే. దేశంలోనే అగ్రస్థానంలో ఉండే టమాట పంటను.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా.. రైతులు ఆ పంటను వేయట్లేదు. గతేడాది ఖరీఫ్ నాటితో పోలిస్తే ఈసారి ఏకంగా 63 వేల ఎకరాల సాగు తగ్గడమే పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. 10 రోజుల నుంచి మదనపల్లె మార్కెట్‌కు సైతం టమాటా రాక తగ్గింది. కిందటేడాదితో పోలిస్తే ఉల్లి సాగు కూడా 36 వేల ఎకరాలు తగ్గింది. సాధారణంగా కర్నూలు ఉల్లి మార్కెట్‌కు ఈ సమయంలో రోజుకు 10 లారీల సరకు వచ్చేది.. ఇప్పుడు ఒకటి, రెండుకు మించి వచ్చే పరిస్థితి లేదు.