ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శేజల్ ఆత్మహత్యయత్నం..
X
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆమె విషం తాగగా..వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు శేజల్ ఓ లేఖ రాసింది.
శేజల్ రాసిన లేఖ..
గౌరవనీయులైన న్యాయమూర్తులకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు, మీడియా మిత్రులకు నా విన్నపం..
నన్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరియు వారి అనుచరులైన భీమాగౌడ్, చిల్లరపు సతీష్, కుమ్మరి పోచన్న, కొనంకి కార్తీక్ లు కొంత కాలంగా మానసికంగా రకరకాలుగా హింసిస్తున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నన్ను వేధిస్తూ వాళ్ల అనుచరులతో చంపుతానని బెదిరిస్తుండటంతో నేను ఢిల్లీకి వచ్చి నిరసన తెలియజేస్తుండగా..గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో నా ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ నా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. గోలి శివ మరియు ఇంకో వ్యక్తి నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు. నేను పలుమార్లు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసులను నమోదు చేయకపోగా తప్పుడు కేసులు నా మీద పెడుతూ నన్ను చిత్ర హింసకు గురిచేస్తున్నారు.
విజ్ఞప్తి : నేను చనిపోయిన తర్వాత అయినా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ..నేను ఈ సూసైడ్ లెటర్ రాస్తున్నాను..అని ఆమె లేఖతో తెలిపారు.
ఢిల్లీ వేదికగా ఆందోళన
గత కొంతకాలంగా అరిజిన్డెయిరీ నిర్వాహకులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య వివాదం నడుస్తోంది. బెల్లం చిన్నయ్య తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ అరిజిన్డెయిరీ సీఈఓ ఆరోపణలు చేస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తన పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. డెయిరీ సీఈవో ఆదినారాయణతో కలిసి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం శేజల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.