వారంతా నా కూతుళ్లతో సమానం.. సస్పెండ్ తర్వాత స్టేట్‌మెంట్
X
హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన దారుణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్పోర్ట్ స్కూల్‌లోని బాలికలపై వేధింపులకు పాల్పడ్డ ఓఎస్‌డీ అధికారి హరికృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్వీట్ చేయగా.. అందుకు స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే చర్యలకు దిగారు. బాలికలపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి ఓఎస్డీ హరికృష్ణను తప్పిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాఫ్తు జరిపిస్తామని, ఒకటి రెండు రోజుల్లోనే దోషులను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు, నాయకులు, ఉద్యోగులు.. ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టబోమని వివరించారు.
అయితే.. ఈ వివాదంపై హకీంపెట్ ఓఎస్డి హరికృష్ణ స్పందించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పై బురదజల్లే ప్రయత్నం ఇదని.. స్పోర్ట్స్ స్కూల్ బాలికలు నన్ను డాడి అని పిలుస్తారని వెల్లడించారు. బాలికలు నా కూతురుతో సమానం…ఎలాంటి అధికారి కూడా లైంగిక వేధింపులు పాల్పడలేదని పేర్కొన్నారు. ఇవన్నీ అవాస్తవం అన్నారు. కానీ బయటపడుతున్న నిజాలు మాత్రం మరోలా ఉన్నాయి. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న ఓఎస్డి హరికృష్ణ.. బాలికల గదిలోకి అర్ధరాత్రి చోరబడుతాడని తెలిసింది. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలు వివిధ ఆటల పోటీలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నారు. హాస్టల్ లో ఉంటూ ప్రాక్టీస్ చేసే వారికి... స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణనే కోచింగ్ ఇప్పిస్తున్నాడు. కొంతకాలంగా హరికృష్ణ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్ లోకి అధికారులైనా సరే రాత్రిపూట పురుషులు వెళ్లడం నిషేధం.. అయితే, ఓఎస్డీ మాత్రం హాస్టల్ ఆవరణలోని గెస్ట్ హౌస్ లోనే మకాం పెట్టారని బాలికలు చెప్పారు. బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వివరించారు. అర్ధరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. హరికృష్ణకు ఓ మహిళా ఉద్యోగి సహా ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సదరు మహిళా ఉద్యోగితో ఓఎస్డీకి అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.