Home > తెలంగాణ > బండికి సంజయ్కు షాక్.. కొత్త వారికి కరీంనగర్ ఎంపీ టికెట్..?

బండికి సంజయ్కు షాక్.. కొత్త వారికి కరీంనగర్ ఎంపీ టికెట్..?

బండికి సంజయ్కు షాక్.. కొత్త వారికి కరీంనగర్ ఎంపీ టికెట్..?
X

అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితమైన బీజేపీ.. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కనీసం 10 స్థానాల్లో పాగా వేయాలని భావిస్తున్న కమలదళం.. గెలుపు గుర్రాల వేటలో పడింది. ఇందులో భాగంగా కొందరు పార్టీ సీనియర్లకు షాకిచ్చేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ టికెట్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కాకుండా కొత్త వారికి ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన హైకమాండ్ కొత్త వారికి అవకాశమివ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోవడం, గెలిచిన 8మందిలో రాజాసింగ్ మినహా మిగిలిన ఏడుగురు కొత్త వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటి ప్రయోగమే చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కొత్త వారికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీలో వర్గపోరు

నిజానికి రాష్ట్ర బీజేపీని అంతర్గత సమస్యలెన్నో వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాకపోవడానికి ఇదే కారణమని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. అందుకే ఈసారి సీనియర్లకు చెక్ పెట్టడం లేదా నియోజకవర్గాలను మార్చడం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. కొత్తవారికి అవకాశమివ్వాలన్న పార్టీ హైకమాండ్ నిర్ణయంతో కొందరు సీనియర్లకు ఊహించని షాక్ తగలనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి భంగపడ్డ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ను ఈసారి కరీంనగర్ బరి నుంచి తప్పించాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ టికెట్ ను పాడి ఉదయ నందన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గెలుపు గుర్రాలకు సంబంధించి బీజేపీ నిర్వహించిన సర్వే, కుల సమీకరణాలు, అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత తదితర అంశాల ఆధారంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ముదిరాజ్, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు లక్షా 50వేల చొప్పున ఉన్నాయి. రెడ్డి ఓట్లు లక్షా 30వేలు, 90వేల మున్నూరు కాపు, 3 లక్షల ఎస్సీ ఓట్లు ఉన్నాయి.

కుల సమీకరణాలు

బీజేపీ హైకమాండ్ ఒకవేళ బండికి టికెట్ ఇస్తే ఈటల రాజేందర్ తో ఉన్న విబేధాల కారణంగా ముదిరాజ్ ఓట్లు దూరమయ్యే అవకాశముంది. మరోవైపు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి సైతం తమ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ లెక్కన బండికి టికెట్ ఇస్తే బీసీ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన ఓట్లు దూరమవుతాయని పార్టీ జాతీయ నాయకత్వానికి రిపోర్టు అందినట్లు సమాచారం.

ఉదయనందన్ నేపథ్యం

హుజూరాబాద్ వీణవంకకు చెందిన ఉదయ నందన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. సిమెన్స్ కంపెనీలో ఇంజనీర్గా ప్రస్థానం మొదలుపెట్టారు. నాలుగేళ్లలో ఆయన.. అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. అనేక ఇండస్ట్రీలు పెట్టి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారు. యప్ టీవీ వ్యవస్థాపకుడిగా ఉదయ్ మంచి గుర్తింపు పొందారు. జిల్లాలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ఉదయనందన్ రెడ్డిది రాజకీయ కుటుంబమే. ఆయన తాత పాడి సుధాకర్ రెడ్డి. ఉదయనందన్ ను ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయమని ఇప్పటికే చాలా పార్టీలు అడిగినా ఆయన మొగ్గు చూపలేదు కానీ ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఉదయనందన్​రెడ్డి బరిలో దిగేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

బండి స్థానం మార్పు..?

ఇదిలా ఉంటే కరీంనగర్ నుంచి తప్పించిన బండి సంజయ్ను జహీరాబాద్ బరిలో నిలపాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతంలో పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్కు యూత్తో పాటు మాస్ ఫాలోయింగ్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కామారెడ్డి స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఎల్లారెడ్డి, జుక్కల్, ఆందోల్, జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ ఓట్ల శాతం పెరిగింది. నారాయణ్ ఖేడ్ కర్నాటకు సరిహద్దుల్లో ఉండటం కూడా ఎంపీ ఎన్నికల్లో కలిసొస్తుందని అంటున్నారు. ఈ లెక్కన కరీంనగర్, జహీరాబాద్ రెండు ఎంపీ సీట్లు తమ ఖాతాలో పడతాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

గెలుపు గుర్రాల వేట

మరోవైపు ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావును మార్చుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. రాథోడ్ బాపూరావు, రమేశ్ రాథోడ్​లలో ఒకరికి ఆ టికెట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి నియోజకవర్గాల్లో కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్నా.. న్యూట్రల్ అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది.




Updated : 13 Jan 2024 7:55 PM IST
Tags:    
Next Story
Share it
Top