Home > తెలంగాణ > అయోధ్య రామయ్యకు హైదరాబాద్ బంగారు పాదుకలు.. చేసింది ఎవరంటే?

అయోధ్య రామయ్యకు హైదరాబాద్ బంగారు పాదుకలు.. చేసింది ఎవరంటే?

అయోధ్య రామయ్యకు హైదరాబాద్ బంగారు పాదుకలు.. చేసింది ఎవరంటే?
X

అయోధ్య రామమందిరం పనులు శర వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే అయోధ్యలో రాముడు కొలువు దీరనున్నాడు. ఇక అయోధ్య ఆలయ నిర్మాణ క్రతువులో హైదరాబాద్ నగరం మరో అదృష్టాన్ని దక్కించుకుంది. ఇప్పటికే బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్‌లో అయోధ్య ఆలయ ప్రధాన ద్వారాలు, ఇతర తలుపులు తయారుకాగా.. ఇప్పుడు రాముల వారి పాదుకలు కూడా భాగ్యనగరంలోనే సిద్ధమయ్యాయి. ఓల్డ్ ఓయిన్ పల్లిలోని హష్మత్ పేటకు చెందిన లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారి శ్రీమద్విరాట్​కళాకుటీర్​ సంస్థ రాముల వారి పాదుకులను తయారుచేసింది. 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల వెడల్పు, 1 అంగుళం మందంతో చేసిన ఈ పాదుకలను.. బంగారం, వెండి, రాగి, సత్తు , తగరం లోహాలతో 12.6 కిలోల పంచలోహాలతో తయారుచేశారు.

రామలింగాచారి సహా.. మరో ఆరుగురు శిల్పులు ఈ పాదుకులు తయారుచేశారు. ‘అయోధ్య భాగ్యనగరం సీతారామా సేవా ట్రస్ట్’​ ఫౌండేషన్ స్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రీ.. పాదుకల తయారీ పనులను రామలింగాచారికి అప్పగించారు. వీటి తయారికోసం శిల్పశాస్త్ర గ్రంథాల్లోని డిజైన్లు, పాత పాదుకలను పరిశీలించి తయారుచేశారు. వీటిపై శంఖు, చక్రాలు, గోమాత, ఏనుగు, జెండా, ఓం స్వస్తిక్​, సూర్యచంద్రులు, రెండు కల్ప వృక్షాలు, కత్తి, అంకుశం, చేప, కలశం, రెండు పద్మాల గుర్తులు చెక్కారు. అంతేకాకుండా సీతమ్మకు అత్యంత ఇష్టమైన చింతాకు పతకాలకు గుర్తుగా.. పాదులకు రెండు ఆకు పచ్చని రాళ్లను చైన్నై నుంచి తెప్పించి అమర్చారు. ఈ పాదుకలను తయారుచేసేందుకు 25 రోజుల సమయం పట్టగా.. డిసెంబర్ 30న అయోధ్యకు పంపించారు.

Updated : 3 Jan 2024 2:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top