Home > తెలంగాణ > పార్టీ మార్పు వార్తలు.. పాల్వాయి స్రవంతి ఏమన్నారంటే..?

పార్టీ మార్పు వార్తలు.. పాల్వాయి స్రవంతి ఏమన్నారంటే..?

పార్టీ మార్పు వార్తలు.. పాల్వాయి స్రవంతి ఏమన్నారంటే..?
X

మునుగోడు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. తాను బీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని స్రవంతి స్పష్టం చేశారు. ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాంటి వార్తలు వినిపించాయని గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాల్లో పర్యటించి కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే సేకరిస్తున్నానని స్రవంతి స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడంతో ఈ సారి ఎన్నికల్లో స్రవంతికి పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె.. బీఆర్ఎస్ పార్టీలో చేరతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆ పుకార్లపై స్పష్టత ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఇచ్చింది. నియోజకవర్గంలో కీలక నేత అయిన పాల్వాయి స్రవంతి తనకు టికెట్ రాకపోయినా రాజగోపాల్ గెలుపు కోసం పని చేశారు. అనంతరం రాజగోపాల్ రాజీనామాతో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోదిగిన స్రవంతి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండో విడత అభ్యర్థుల జాబితాలో మునుగోడు టికెట్ సొంతం చేసుకున్నారు. దీంతో పాల్వాయి స్రవంతి తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ను కాదని బీజేపీలోకి వెళ్లిపోయి, మళ్లీ సొంత గూటికి వచ్చిన రాజగోపాల్ కు టికెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన లాంటి వారు నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉన్నామని, తమనే విస్మరించారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.




Updated : 1 Nov 2023 3:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top