ఎన్నికల వేళ జోరుగా నకిలీ దందా.. ఓటర్లే టార్గెట్
X
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హామీలు, డిక్లరేషన్లు ప్రకటిస్తూ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఓట్లను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలైంది. డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ మద్యం కలవర పెడుతుంది. తక్కువ ధరకే వస్తుండటంతో కొనుగోలు చేసి.. ప్రచారంలో పాల్గొనే జనాలు, ఓటర్లకు అంటగడుతున్నారు. ఓటర్లైను మభ్యపెట్టడం అటుంచితే నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకు చెలగాటం అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. క్యాంపెయినింగ్ లో పాల్గొనేవారికి చాలామంది బీరు, బిర్యానీ ఆశతో వస్తుంటారు. అయితే వారికి ఇస్తున్నవి అసలైనవా, నకిలీవా అనేది తెలియదు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే చాలామంది లీడర్లు వైన్స్ తో డీల్ కుదుర్చుకుని.. చెక్ లు పంపిణీ చేశారు. టైంకి అందించాలని మాట్లాడుకున్నారు. దీంతో నిర్వాహకులు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని విక్రయదారులు.. నకిలీ లిక్కర్ ను మార్కెట్ లోకి విచ్చలవిడిగా తీసుకొస్తున్నారు. ఈ లెక్కన మార్కెట్ లో 30 శాతం నకిలీ లిక్కర్ ఉన్నట్లు తెలుస్తుంది.
మునుగోడు బైపోల్ టైంలో కూడా నకిలీ మద్యం ఏరులై పారిందని కొందరు అధికార పార్టీ లీడర్లే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కూడా నకిలీ మద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రజలకు పంచుతున్నారని చెప్పారు. ఇందులో ప్రధానంగా పేదలు, మధ్యతరగతి వాళ్లు తాగే రూ.వెయ్యి లోపు బ్రాండ్లనే అక్రమార్కులు ఎక్కువగా టార్గెట్ చేశారు. వాటి లేబుల్స్ ముందుగానే తయారుచేయించి.. నకిలీ బాటిల్స్ కు అతికిస్తున్నారు. కాగా తనిఖీల్లో భాగంగా ఈసీ ఇప్పటివరకు లక్షా 10 వేల లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసింది. అందులో 30 శాతం నకిలీ బ్రాండ్లే ఉన్నాయి. గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నకిలీ మద్యం తయారు అవుతున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. అలా తయారుచేసిన మద్యాన్ని ఎక్కువ శాతం గ్రామాలకే తరలిస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంది. నకిలీ మద్యంపై ఈసీ, ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.