పెద్దల సభకు ఆ ఇద్దరు.. మరి వీహెచ్ సంగతేంటి..?
X
తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది. అయితే గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వి.హనుమంతరావుకు మాత్రం ఈ ప్రకటన నిరాశ కలిగించింది. ఈసారి రెండు స్థానాలు కాంగ్రెస్ కైవసం అయ్యే అవకాశముండటంతో రాజ్యసభకు వెళ్లడం ఖాయమని వీహెచ్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.
ఖమ్మంలో పార్టీ అంతర్గత విభేదాలు ఎక్కువ. మాజీ కేంద్ర మంత్రిగా రేణుకచౌదరి గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఆమె ఖమ్మం జిల్లాలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఖమ్మం జిల్లాలో రేణుక చౌదరి అంటే పడని కాంగ్రెస్ నేతలు చాలా మందే ఉన్నారు. ఆమెకు తిరిగి ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే ఓడిస్తారని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ రేణుకను పెద్దల సభకు పంపారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడైన అనిల్ కుమార్ యాదవ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ను వయసు చిన్నదే అయినా పెద్దల సభకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితో సామాజికవర్గం కోణంలోనే ఈ ఎంపిక జరిగిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
వాస్తవానికి ఈసారి రాజ్యసభ టిక్కెట్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు వీహెచ్ కు దక్కుతుందని అందరూ భావించారు. ఆయన కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేసే ఆయన.. ఈ మధ్య సైలెంటైపోయారు. సామాజికవర్గ కోణంలో తమకు న్యాయం జరుగుతుందని బీసీ కార్డు కూడా ఉపయోగించారు. అయినా హస్తం పార్టీ ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ వాదన మాత్రం మరోలా ఉంది. ఆయనకు పార్టీ పదవి ఇవ్వాలన్న నిర్ణయంతోనే రాజ్యసభకు పంపలేదని అంటోంది.