Home > తెలంగాణ > రేపు మధ్యాహ్నం మంత్రిగా పట్నం ప్రమాణం..

రేపు మధ్యాహ్నం మంత్రిగా పట్నం ప్రమాణం..

రేపు మధ్యాహ్నం మంత్రిగా పట్నం ప్రమాణం..
X

తెలంగాణ మంత్రివర్గం పునర్వ్యవస్తీకరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మొండిచేయి చూపిన కేసీఆర్.. ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టనున్నారు. రేపు (గురువారం) మధ్యాహ్నం మూడు గంటలకు పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్టర్లో తెలిపారు. అంతకుముందు పట్నం ప్రమాణం ఇవాళే(బుధవారం) ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే గవర్నర్ తమిళిసైకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రమాణస్వీకారం గురువారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. ఈ సమయంలో పట్నం మంత్రిగా ప్రమాణం చేస్తుండడం గమనార్హం. 1994, 1999, 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహేందర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి తెలంగాణ తొలి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌ రెడ్డి చేతిలో మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.

ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో తాండూరులో పరిస్థితి పైలెట్ వర్సెస్ పట్నం అన్నట్లు మారింది. తాజాగా తాండూరు టికెట్ మరోసారి రోహిత్ రెడ్డికి ఇచ్చారు. దీంతో పట్నం బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరడం ఖాయమన్న పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలో కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా మంత్రి పదవి కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు. ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకుంటే దీంతో చెక్ పెట్టొచ్చనేది గులాబీ బాస్ ఆలోచనగా తెలుస్తోంది.

Updated : 23 Aug 2023 9:47 PM IST
Tags:    
Next Story
Share it
Top