ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో చేరాలనుకున్నారు.. కానీ : Patnam Narender Reddy
X
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. వీరిద్దరు సీఎంని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే ఆయన హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
మహేందర్ రెడ్డి సీఎంని కలవడంపై ఆయన సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరుదామని మహేందర్ రెడ్డి తనతో చర్చించినట్లు చెప్పారు. కానీ ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని.. బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. తన అన్న, వదిన సీఎం కలవడంపై సమాచారం లేదన్నారు. మీడియాలో చూసే ఆ విషయం తెలుసుకున్నట్లు తెలిపారు. చేవేళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్లో చేరుతున్నారమో అని అభిప్రాయపడ్డారు.