Patnam Sunita : బీఆర్ఎస్కు వికారాబాద్ జడ్పీ చైర్మన్ రాజీనామా
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోక ముందే బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆ లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. రాజీనామా చేయడంతో పాటు.. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు లేఖలో తెలిపారు. కాగా ఆమె తన భర్త, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా హస్తం గూటికి చేరనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సునీత.. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బీఆర్ఎస్ కు చెందిన మరికొందరు ముఖ్య నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. తీగల కృష్ణా రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా వీరంతా ఇప్పటికే సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలోన వారంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది.